E-PAPER

పలాసలో వామపక్షాల నిరసన.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్

శ్రీకాకుళం జిల్లా, పలాస – అక్టోబర్ 2 (Y7 న్యూస్):

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె. మోహనరావు, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చాపర సుందరలాల్, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి టీ. సన్యాసిరావు ఆధ్వర్యంలో పలాసలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి శ్రీనివాస జంక్షన్, మూడు రోడ్ల కూడలి మీదుగా పాత బస్టాండ్‌లోని గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన సాగింది. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం పనితీరుపై ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనాల్లో వెల్లడైన అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. SIR (Special Intensive Revision), ఓటరు నమోదు కోసం ఉపయోగించే Form-6లో మార్పులు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల అమలుపై తాము గతంలో వ్యక్తం చేసిన ఆందోళనలకు ఈ కథనాలు బలం చేకూర్చాయని పేర్కొన్నారు.

ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాలు పేర్కొన్నాయని నాయకులు తెలిపారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ఈ అభిప్రాయ భేదాలను నిర్ణయ ప్రక్రియలో భాగంగానే పేర్కొంటూ, తుది నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నామని వెల్లడించింది.

ఎన్నికల సంఘం స్వతంత్రత, నిష్పాక్షికతపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన అవసరం ఉందని వామపక్ష నాయకులు అన్నారు. SIR ప్రక్రియలో అన్యాయంగా ఓటర్ల పేర్లు తొలగించబడితే వాటిని పునరుద్ధరించాలని, ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

అలాగే SIR ప్రక్రియను నిలిపివేయాలని, ఓటర్ల జాబితా నుంచి మినహాయించబడిన అర్హులైన వ్యక్తుల ఓటు హక్కులను పునరుద్ధరించాలని కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుత విధానాన్ని మార్చి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఎంపిక కమిటీ విధానాన్ని తీసుకురావాలని వారు కోరారు.

ఓటు హక్కును పరిరక్షించాలని, ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని, ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వామపక్ష నాయకులు నినదించారు.

ఈ కార్యక్రమంలో ఎన్. గణపతి, కె. రమేష్, టీ. అజయ్ కుమార్, మద్దిలి రామారావు, ఎం. వినోద్ కుమార్, కె. బాలాజీ, కె. హేమసూదన్, వై. కామేశ్వరరావు, టీ. భాస్కరరావు, టీ. సింహాచలం, సీహెచ్. రవి, లండ వెంకటరావు, కె. దుష్యంత్, పి. నాగేశ్వరరావు, కె. లోకనాధం, గోరు వాసు, ఎం. లావణ్య, బి. శశిరేఖ, బి. స్వాతి, టీ. వరలక్ష్మి, యస్. కుమార్, డప్పు కళాకారుడు యస్. రామారావుతో పాటు వివిధ కార్మిక, ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!