కొత్తగూడెం, సెప్టెంబర్ 19: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రాంచ్ పాలకవర్గ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ నియమించిన జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 15 జిల్లా కార్యవర్గ సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
జిల్లా బ్రాంచ్‌కు సంబంధించిన తుది ఓటర్ల జాబితాలో 2,576 మంది సభ్యులు ఉన్నట్లు ఎన్నికల నోటీసులో పేర్కొన్నారు. ఎన్నికలు పోటీ ఏర్పడిన పక్షంలో అక్టోబర్ 4, 2026న IDOC కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్
నామినేషన్ల దాఖలు: సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.
నామినేషన్ స్థలం: IDOC కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం.
నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.
నామినేషన్ల ఉపసంహరణ: సెప్టెంబర్ 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.
తుది అభ్యర్థుల జాబితా: సెప్టెంబర్ 26న మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటించనున్నారు. అదే రోజు పోటీ లేకుండా అన్ని స్థానాలకు సరిపడా అర్హమైన నామినేషన్లు మాత్రమే వచ్చినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
పోటీ ఉంటే అక్టోబర్ 4న పోలింగ్ నిర్వహించి, పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలను ప్రకటించడంతో పాటు ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యుల నుంచి చైర్మన్, వైz ఈస్ చైర్మన్, ట్రెజరర్, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.
నామినేషన్ ఫీజు రూ.10 వేలు
ప్రతి నామినేషన్‌కు రూ.10,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము తిరిగి చెల్లించబడదని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. అభ్యర్థి స్వయంగా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించాలి. అభ్యర్థితో పాటు ప్రపోజర్, సెకండ్ ప్రపోజర్ ఉండాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక్క అభ్యర్థికి మాత్రమే ప్రపోజర్ లేదా సెకండ్ ప్రపోజర్‌గా ఉండే అవకాశం ఉంటుంది.
పోటీ చేసే అభ్యర్థి రెండు నామినేషన్ పత్రాలను దాఖలు చేసుకోవచ్చని నోటీసులో పేర్కొన్నారు. నామినేషన్ పత్రంతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను సమర్పించాలి.
ఓటర్లకు సూచనలు
ఓటు హక్కు కలిగిన IRCS సభ్యులు తమకు జారీ చేసిన IRCS గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఎన్నికల అధికారి సూచించారు. ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి నుంచి పొందవచ్చని తెలిపారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రాంచ్ ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఎన్నికల నోటీసులో పేర్కొన్నారు.









