Lదుమ్ముగూడెం, సెప్టెంబర్ 17 (వై7 న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మలేరియా విభాగం అదనపు డైరెక్టర్ డా. పద్మజ, రాష్ట్ర ప్రోగ్రామింగ్ అధికారి (M&F) గురువారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె పీహెచ్‌సీలోని వైద్య సిబ్బందితో సమావేశమై మలేరియా కేసుల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ల్యాబ్, ఫార్మసీ విభాగాలను పరిశీలించి మలేరియా నిర్ధారణ పరీక్షలు, నమోదైన కేసుల వివరాలు, మందుల నిల్వలపై సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ల్యాబ్‌లో ఇప్పటివరకు నమోదైన మలేరియా కేసుల పూర్తి వివరాలను పరిశీలించిన ఆమె, ప్రతి కేసుకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా భద్రపరచాలని సూచించారు. మలేరియా బారినపడిన రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.
అలాగే ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు గ్రామాల్లో నిరంతరం పర్యటిస్తూ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధుల నియంత్రణలో క్షేత్రస్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. శ్రీధర్, డీడీ మనోహర్, నరసాపురం పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డా. పావని రెడ్డి, డీపీఎంఓ పాయం శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.








