ఖమ్మం, సెప్టెంబర్ 8 (వై7 న్యూస్): శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బుల్లెట్ ద్విచక్ర వాహనాల సైలెన్సర్లపై ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన, అధిక శబ్దం వచ్చే 400 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ రామానుజం మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అధిక శబ్దంతో వాహనాలు నడపడం, వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్చడం వంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనదారులు తమ ద్విచక్ర వాహనాలకు కంపెనీ నిర్దేశించిన ఒరిజినల్ సైలెన్సర్లనే వినియోగించాలని సూచించారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని కోరారు.
ప్రజల ప్రశాంతత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శబ్ద కాలుష్య నియంత్రణకు పోలీసుల చర్యలు కొనసాగుతాయని రామానుజం తెలిపారు. గతంలో 1,654 బుల్లెట్ సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.








