E-PAPER

మధు ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని డిమాండ్ స్పందించకపోతే నిరవధిక దీక్షకు సిద్ధం: బోడ రమేష్

పినపాక, సెప్టెంబర్ 7 (వై7 న్యూస్): తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని కాంగ్రెస్ నాయకుడు బోడ రమేష్ అన్నారు.
సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు రాజ్యాంగ విలువలు, సభా సంప్రదాయాలు, ప్రజాస్వామ్య మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉంటారని పేర్కొన్నారు. అయితే తాతా మధు వ్యవహరించిన తీరు సభా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని విమర్శించారు.
దళిత వర్గానికి చెందిన స్పీకర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం కేవలం ఒక వ్యక్తిని కించపరచడం కాదని, సామాజిక న్యాయం, సమానత్వం వంటి రాజ్యాంగ విలువలను అవమానించినట్లేనని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్య సమాజం సహించదని స్పష్టం చేశారు.
తాతా మధు వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి, సభా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు సభకు, ప్రజాస్వామ్యానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బోడ రమేష్ హెచ్చరించారు. ఇది వ్యక్తిగత రాజకీయ అంశం కాదని, రాజ్యాంగ పరిరక్షణ మరియు ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కొంబత్తిని శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడు మునిగల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!