
దుమ్ముగూడెం మండలం చిన్నబండిరేవు గ్రామానికి చెందిన తెల్లం మహేష్ అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేష్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మహేష్ మరణ వార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.
అనంతరం నిర్వహించిన అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని మహేష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా అంతిమ యాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తన తమ్ముడి కుమారుడైన మహేష్ పాడెను ఎమ్మెల్యే స్వయంగా మోసి చివరి వీడ్కోలు పలకడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. ఎమ్మెల్యేతో పాటు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
తెల్లం మహేష్ మృతితో చిన్నబండిరేవు గ్రామంతో పాటు దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.








