
బూర్గంపాడు, సెప్టెంబర్ 3: అమరజీవి కందుకూరి నాగేశ్వరరావు ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

గురువారం బూర్గంపాడు మండలంలోని పాత సారపాకలో నిర్వహించిన కందుకూరి నాగేశ్వరరావు సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు చిటికెన ముసలయ్యతో కలిసి కందుకూరి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కందుకూరి నాగేశ్వరరావు జీవితాంతం పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా సేవకే ప్రాధాన్యత ఇచ్చిన ఆయన నిస్వార్థ సేవలు కార్యకర్తలకు ఆదర్శమని పేర్కొన్నారు. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగిన పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు.
నాగేశ్వరరావు మరణం పార్టీకి, ఆయన కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న ఆయన, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ మరణించిన నాయకులు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో అమరజీవులుగానే నిలిచిపోతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, అన్నవరపు సత్యనారాయణ, చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు, కరకగూడెం మండల కార్యదర్శి కొమరం కాంతారావు, ములకలపల్లి సీఐటీయూ కన్వీనర్ నిమ్మల మధు, మండల కమిటీ సభ్యులు రాయల వెంకటేశ్వర్లు, ఎస్కే అబీద్, పాండవుల రామనాథం, కనకం వెంకటేశ్వర్లు, గుంటక కృష్ణ, బోల్ల శ్రీశైలం, మరియమ్మ, అలివేలమ్మ, ఎస్కే జాను మియా, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.








