ఒకప్పుడు డయాబెటిస్ అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తుందని భావించేవారు. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు 25–30 ఏళ్ల వయసులోనే మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే తమకు కూడా వస్తుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నంత మాత్రాన వ్యాధి తప్పనిసరిగా వస్తుందని భావించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే అలాంటి వారు ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మధుమేహంలో ప్రధానంగా టైప్-1, టైప్-2 రకాలు ఉంటాయి. టైప్-1 డయాబెటిస్‌లో శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోతుంది. ఇది సాధారణంగా చిన్న వయసులోనే ప్రారంభమయ్యే అవకాశం ఉండగా, ఈ వ్యాధి ఉన్నవారికి ఇన్సులిన్ చికిత్స అవసరం అవుతుంది. అయితే టైప్-1 డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికీ కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉండాల్సిన అవసరం లేదు.
మరోవైపు టైప్-2 డయాబెటిస్‌కు కుటుంబ చరిత్రతో పాటు అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి పలు అంశాలు ప్రభావం చూపుతాయి. కుటుంబంలో మధుమేహం ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.








