మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిక్నిక్‌కు వెళ్లి సరదాగా గడిపిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు కేవలం పది రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జలపాతంలో స్నానం చేసిన అనంతరం అంతుచిక్కని అనారోగ్యానికి గురై చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఫిజికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే తన్వీర్ అహ్మద్ కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆగస్టు 16న గోరా టిలా జలపాతం వద్దకు పిక్నిక్‌కు వెళ్లారు. దాదాపు 15 నుంచి 16 మంది జలపాతంలో స్నానాలు చేసి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కొద్దిసేపటికే పలువురు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
వారిలో నలుగురు బాలుర పరిస్థితి వేగంగా విషమించింది. కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించినప్పటికీ, పది రోజుల వ్యవధిలో నలుగురు చిన్నారులు ఒకరి తర్వాత మరొకరు మృతి చెందారు. జలపాతంలో స్నానం చేసిన తర్వాతే అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఘటనకు గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.








