E-PAPER

హోర్ముజ్‌లో అమెరికా నాకాబందీ.. యెమెన్‌లో హూతీల మిసైల్ దాడులు.. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత!

హోర్ముజ్ జలసంధిలో అమెరికా చేపట్టిన నాకాబందీ చర్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. ఇరాన్‌పై నాకాబందీని కఠినంగా అమలు చేస్తున్న అమెరికా నౌకాదళం వాణిజ్య నౌకల రాకపోకలను పర్యవేక్షిస్తోంది. సెప్టెంబర్ 2 నాటికి నిబంధనలు పాటించేలా చేయడంలో భాగంగా 86 వాణిజ్య నౌకల మార్గాలను మార్చినట్లు, మూడు నౌకలను నిలిపివేసినట్లు తెలిపింది. మరో రెండు నౌకల్లోకి సిబ్బంది ప్రవేశించి తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించింది.

మరోవైపు యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు ఏకంగా 10 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించినట్లు సమాచారం. పశ్చిమ యెమెన్‌లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు యెమెన్ ప్రభుత్వ బలగాలు తెలిపాయి. తైజ్ ప్రావిన్స్‌లోని మొఖా నగరం, హొదైదా ప్రావిన్స్‌లోని అల్-ఖోఖా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొన్నాయి. వీటిలో ఎక్కువ మిసైళ్లు మొఖా వైపే ప్రయోగించినట్లు యెమెన్ వర్గాలు వెల్లడించాయి.

ఇదే సమయంలో యెమెన్‌లో హూతీలు, ప్రభుత్వ బలగాల మధ్య భూదాడులు కూడా తీవ్రతరం కావడం ఆందోళన కలిగిస్తోంది. తైజ్‌లోని అల్-కదాహా-అల్-బరాహ్ ప్రాంతంలో హూతీ సాయుధులు భూదాడికి ప్రయత్నించగా.. ప్రభుత్వ బలగాలు తిప్పికొట్టినట్లు సమాచారం. ఒకవైపు హోర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం నాకాబందీ కొనసాగిస్తుండగా, మరోవైపు యెమెన్‌లో హూతీల మిసైల్, భూదాడులు పెరుగుతున్నాయి. దీంతో హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!