మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ‘ఇరుముడి’ సక్సెస్ కీలక మలుపుగా మారింది. కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొన్న రవితేజ.. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఈ విజయం ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు, ఇకపై సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసే రవితేజ.. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వెంటనే మరో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు.
అయితే ‘ఇరుముడి’ తర్వాత మాత్రం రవితేజ ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. గతంలో సినిమాల సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించిన ఆయన.. ఇకపై స్క్రిప్ట్ విషయంలో తొందరపడకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కథ బలంగా ఉండటం, స్క్రీన్‌ప్లే ఆకట్టుకునేలా ఉండటం, తన పాత్రకు మంచి స్కోప్ ఉండటం వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రవితేజ చేతిలో దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించనున్న సినిమా ఉంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో ‘సరిపోదా శనివారం’ ఫేమ్ వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. వివేక్ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని ఇటీవల రవితేజను కలిసి ‘ఇరుముడి’ విజయంపై అభినందనలు తెలిపినట్లు సమాచారం. అనంతరం వీరి కాంబినేషన్‌లో కొత్త సినిమా తెరకెక్కనున్నట్లు అధికారికంగా వెల్లడైంది.









