భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 3: పోడు రైతు భూమిలో ట్రెంచ్ తవ్వకాలు చేపట్టకుండా ఉండేందుకు రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ బీట్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఆళ్లపల్లి మండలం రామానుజగూడెం గ్రామానికి చెందిన ఓ పోడు రైతు నుంచి లంచం కోరిన అటవీశాఖ బీట్ అధికారి బానోత్ రవికుమార్‌ను, మధ్యవర్తి సాదిక్ ద్వారా డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో ఖమ్మం రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలోని అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో బీట్ అధికారి రవికుమార్‌తో పాటు మధ్యవర్తి సాదిక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం వారిని న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నట్లు సమాచారం.
అధికారుల వివరాల ప్రకారం, ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖకు సంబంధించిన నాలుగో అవినీతి కేసు నమోదైంది. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.








