E-PAPER

గొల్లగుప్పలో సాధారణ పరిస్థితి.. కొత్తగా కేసులు లేవు: కలెక్టర్ దినేష్ కుమార్

ఎటపాక: అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. గ్రామంలో కొత్తగా ఎటువంటి కేసులు నమోదు కాలేదని, ప్రజల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వెల్లడించారు.

గొల్లగుప్ప గ్రామంలో నిరంతర పర్యవేక్షణ కోసం రాపిడ్ రెస్పాన్స్ వైద్య బృందాలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి 6 మంది, కాకినాడ నుంచి 9 మంది, విజయవాడ నుంచి 4 మంది, ఏలూరు నుంచి 5 మంది వైద్యులు రాపిడ్ రెస్పాన్స్ బృందాల్లో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

డీఎంహెచ్‌ఓ డా. పి. సరిత ఆధ్వర్యంలో వైద్య బృందాలు గ్రామంలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. గ్రామంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై కేస్ స్టడీ నిర్వహించి, వ్యక్తిగత ఆరోగ్య రికార్డును రూపొందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య చరిత్ర, గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు, ప్రస్తుతం కనిపిస్తున్న లక్షణాల వివరాలను వైద్య సిబ్బంది నమోదు చేయనున్నారు.

52 మందిలో 32 మంది డిశ్చార్జ్

గొల్లగుప్ప ఘటన నేపథ్యంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 52 మందిలో ఇప్పటికే 32 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 11 మందిని కూడా కొద్దిసేపట్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు.

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి డీసీహెచ్‌ఎస్ డా. సాంబశివరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో బాధితులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి.

బాధితులకు పరామర్శ

సబ్‌ కలెక్టర్ శుభం నోక్వాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి పండ్లు అందజేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అవసరమైన అన్ని వైద్య సేవలను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!