వెనిజులాలోని మధ్యంతర ప్రభుత్వంతో అమెరికా కుదుర్చుకున్న భారీ చమురు ఒప్పందం పశ్చిమార్ధగోళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నికోలాస్ మదురోను అధికారంలో నుంచి తొలగించిన అనంతరం వెనిజులా చమురు వనరులపై పట్టు సాధించేందుకు అమెరికా వ్యూహాత్మకంగా ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో అమెరికా-వెనిజులా సంబంధాలు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రైవేట్ సంస్థ ‘నార్త్ అమెరికన్ బ్లూ ఎనర్జీ పార్ట్‌నర్స్’ నేతృత్వంలో ఈ భారీ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 100 ఏళ్ల లీజు ఒప్పందం ద్వారా వెనిజులాలోని 17 చమురు క్షేత్రాలపై అమెరికాకు కీలక నియంత్రణ లభించనున్నట్లు సమాచారం. ఈ క్షేత్రాల్లో భారీ స్థాయిలో ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
దాదాపు 6,500 కోట్ల బారెళ్ల ముడి చమురు నిల్వలున్న ఈ క్షేత్రాలు అమెరికా రక్షణ శాఖ ఆధిపత్యంలోకి వెళ్లనున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే వెనిజులా చమురు రంగంపై అమెరికా ప్రభావం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయంగా సున్నితంగా ఉన్న వెనిజులా రాజకీయ పరిస్థితుల్లో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.








