E-PAPER

కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలి.. రైతుల నిరసనకు పిలుపు

శ్రీకాకుళం జిల్లా, పలాస – వై 7 న్యూస్

ఉద్దాన ప్రాంతాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 8న ఉద్దానంలోని అన్ని గ్రామాల్లో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్గో ఎయిర్‌పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది.

కార్గో ఎయిర్‌పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు, కార్యదర్శి జోగి అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వామపక్ష, రైతు సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా నాయకులు మద్దిలి రామారావు, సీపీఎం నాయకులు కొనారి మోహన్‌రావు మాట్లాడుతూ.. ఉద్దాన ప్రాంతంలోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములను కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో సేకరించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు.

తమిళనాడులోని పెరంబూర్‌లో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రెండేళ్లుగా ప్రజలు పోరాటం చేశారని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందన్న కారణాలతో అక్కడి ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను రద్దు చేసిన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈ పరిణామం మన ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు.

“కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో ఉద్దాన ప్రజల భూములు, ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే హక్కు ఎవరు ఇచ్చారు?” అంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నాయకులు ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడిబోర్డు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దాన ప్రాంతాన్ని విధ్వంసం చేసే చర్యలకు పాల్పడటం ప్రజలకు వెన్నుపోటు పొడవడం కాదా అని ప్రశ్నించారు.

ఏకకాలంలో నాలుగు పంటలు పండే పచ్చని ఉద్దానం శ్రీకాకుళం జిల్లాకు ప్రకృతి పరిరక్షణ కవచంలా ఉందని, తుపానులు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడంలో ఉద్దాన ప్రాంతంలోని పచ్చదనం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

కార్గో ఎయిర్‌పోర్ట్ కోసం గ్రామాలు, వేలాది ఎకరాల భూమిని సేకరిస్తే వేలాది మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు ఉపాధిని కోల్పోయి నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడుసార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే కాకరపల్లి ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో సుమారు 2,020 ఎకరాల భూమిని సేకరించిన సమయంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఆ ప్రాజెక్టు వల్ల స్థానిక ప్రజలకు, నిర్వాసితులకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయో, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో ప్రజలకు వివరించాలని కోరారు.

అబద్ధపు ప్రచారాలతో ప్రజలను ఎన్నాళ్లూ మోసం చేయలేరని, ప్రజలు చైతన్యంతో ప్రభుత్వ చర్యలను తిప్పికొడతారని నాయకులు హెచ్చరించారు. కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో రైతుల భూముల జోలికి వస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నాయకులు పి.దానేసు, జనశక్తి నాయకులు కోనేరు రమేష్, ఏపీ రైతు సంఘం నాయకులు టి.అజయ్‌కుమార్, ఎంపళ్ల కామేశ్వరరావు, వామపక్ష నాయకులు ఎన్.గణపతి, పి.వైకుంఠరావు, జి.బాలకృష్ణ, జుత్తు వీరాస్వామి, పి.నాగేశ్వరరావు, సి.హెచ్.రవి, పౌరహక్కుల నాయకులు పి.జోగారావు తదితరులు పాల్గొన్నారు.

పోరాట కమిటీ నాయకులు బత్తిని లక్ష్మణరావు, గుంటు లోకనాధం, నల్ల పరుశురాం, పొట్టి ధర్మారావు, గుంటు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!