E-PAPER

సమయానికి రాని అంబులెన్స్..అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూనే కన్నుమూసిన చిన్నారి

చింతూరు, ఆగస్టు 7 (వై7 న్యూస్): పోలవరం జిల్లా చింతూరు మండలం పెద్ద సీతనపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఓ గిరిజన బాలిక ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

గ్రామానికి చెందిన సోడి పాపయ్య కుమార్తె లాస్య (4) మలేరియా జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

అయితే, అత్యవసర సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేటు వాహనంలో భద్రాచలం తరలించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో చిన్నారి లాస్య చికిత్స అందకుండానే మృతి చెందింది.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు, గిరిజన సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట బాలిక మృతదేహంతో నిరసన చేపట్టారు. బీజేపీ జిల్లా కార్యదర్శి డి.వి.ఎస్. రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ, బాలిక మరణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని కోరారు. అలాగే చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలూ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలోని అంబులెన్స్‌లకు డీజిల్ కొరత లేకుండా చూడాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నొక్వాల్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ విషాద ఘటన గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవల పరిస్థితిపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!