టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ నిఘా సంస్థలు టెలిగ్రామ్ వేదికను ఉపయోగించి రష్యాలో దాడులు నిర్వహించేందుకు యువకులను నియమించుకున్నప్పటికీ, ఆ కార్యకలాపాలను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోలేదని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించారనే అభియోగాలతో దురోవ్పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు రష్యా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అలాగే ఆయనను అంతర్జాతీయ వాంటెడ్ జాబితాలో చేర్చినట్లు ప్రకటించాయి.
ఎఫ్ఎస్బీ ప్రకారం, ఉక్రెయిన్ భద్రతా సంస్థలు నిర్వహిస్తున్నట్లు ఆరోపిస్తున్న కొన్ని టెలిగ్రామ్ ఛానళ్లు, గ్రూప్ చాట్లు, బాట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా రష్యా భూభాగంలో దాడులకు ప్రణాళికలు రూపొందించడం, యువకులను నియమించుకోవడం వంటి కార్యకలాపాలు జరిగినట్లు ఆరోపించింది. ఈ చర్యలను అడ్డుకునే బాధ్యత టెలిగ్రామ్ యాజమాన్యంపై కూడా ఉందని రష్యా వాదిస్తోంది.
ఈ దాడుల వల్ల మహిళలు, చిన్నారులు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారని, కోట్లాది రూబుళ్ల విలువైన ఆస్తి నష్టం సంభవించిందని ఎఫ్ఎస్బీ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, గణాంకాలను స్వతంత్రంగా ధ్రువీకరించలేదని గమనించాలి. ఈ వ్యవహారంపై టెలిగ్రామ్ లేదా పావెల్ దురోవ్ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.









