E-PAPER

పలాసలో గ్రావెల్ మాఫియా ఆగడాలు..! తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలోనే అక్రమ గ్రావెల్ నిల్వలు

పలాస, జూన్ 23: శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణ పరిసర ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు, రవాణా, నిల్వలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మొగిలిపాడు – తర్లాకోట మార్గంలో భారీ ఎత్తున గ్రావెల్‌ను తరలించి ఒక ప్రైవేట్ స్థలంలో నిల్వ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో AP39VA5572 నంబర్ గల వాహనం ద్వారా గ్రావెల్ రవాణా జరిగినట్లు సమాచారం.

స్థానికుల కథనం ప్రకారం, రాత్రింబవళ్లు భారీ వాహనాల ద్వారా గ్రావెల్‌ను తరలించి కుప్పలుగా నిల్వ చేస్తున్నారని చెబుతున్నారు. అక్రమంగా తరలించిన గ్రావెల్‌తో పాటు సంబంధిత వాహనం కూడా అక్కడే కనిపించినట్లు పేర్కొంటున్నారు.

ఈ మొత్తం వ్యవహారం పలాస తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, వాహన నంబర్లతో సహా పలు ఆధారాలు వెలుగులోకి వచ్చినప్పటికీ అధికారుల స్పందన లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే విధంగా సహజ వనరులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ గ్రావెల్ తవ్వకాలు పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా భారీ నష్టం కలిగిస్తున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత శాఖలు మౌనం వహించడం వెనుక అసలు కారణం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

AP39VA5572 వాహనం ద్వారా జరిగినట్లు చెబుతున్న గ్రావెల్ రవాణాపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమ నిల్వలు, అక్రమ తవ్వకాల వెనుక ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తారా..? అక్రమ గ్రావెల్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతారా..? అనే ప్రశ్నలు ప్రస్తుతం పలాసలో హాట్ టాపిక్‌గా మారాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!