E-PAPER

ఇసుక అక్రమ దందాల్లో కీలక నిందితుడు అరెస్ట్: ఏసీపీ సారంగపాణి

ఖమ్మం, జూన్ 9 (వై7 న్యూస్): ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం జిల్లాకు అక్రమంగా ఇసుక రవాణా నిర్వహిస్తున్న కీలక నిందితుడిని చింతకాని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు.

జూన్ 5న ఆంధ్రప్రదేశ్‌లోని కంచికచర్ల ప్రాంతం నుంచి టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతకాని మండలానికి చెందిన మాతంగి నాగరాజు (34) మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమ్మం వైపు బైక్‌పై వస్తున్న నాగరాజును, బోనకల్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న ఇసుక టిప్పర్ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనకు కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, కేసు దర్యాప్తును విస్తరించి అక్రమ ఇసుక రవాణా వెనుక ఉన్న ప్రధాన నిర్వాహకుడిని గుర్తించారు. ఖమ్మం నగరంలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన దేవేందర్ (35), లారీ యజమానిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు ఏసీపీ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం జరుగుతోందని, ఇటువంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వైరా డివిజన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, పోలీసుల తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని ఏసీపీ సారంగపాణి తెలిపారు. ధనార్జనే లక్ష్యంగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News