24 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
భద్రాచలం: జిల్లా కలెక్టర్ (CS) మరియు జిల్లా పౌర సరఫరాల అధికారి ఆదేశాల మేరకు సివిల్ సప్లై శాఖ అధికారులు భద్రాచలం పట్టణంలో మెరుపు దాడులు నిర్వహించారు. సివిల్ సప్లై అధికారి జి. రాజులు, రాంబాబు మరియు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సంయుక్తంగా స్థానిక హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఒకేసారి తనిఖీలు చేపట్టారు.
ఈ దాడుల్లో గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన 24 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన సిలిండర్లను భద్రతా పరిరక్షణ కోసం స్థానిక గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు.
ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి జి. రాజులు మాట్లాడుతూ, హోటల్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు గృహ అవసరాల కోసం ఇచ్చే డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.








