హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బన్‌గావ్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతూ కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు. జూన్ 17వ తేదీ రాత్రి అతను బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, తనిఖీలు చేస్తున్న ఇద్దరు ఏఎస్సైలు, ఒక హోంగార్డు అతన్ని ఆపారు. ముఖానికి గుడ్డ కట్టుకున్నాడని అతన్ని కొట్టి, మొబైల్ లాక్కొని బలవంతంగా లద్వా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
తాను క్యాన్సర్ రోగినని మొత్తుకున్నా పోలీసులు కనికరం చూపలేదు. కీమోథెరపీ కారణంగా కాళ్లపై వెంట్రుకలు ఊడిపోవడాన్ని ఎగతాళి చేస్తూ.. అమ్మాయిలా స్మూత్‌గా ఉన్నావంటూ వేధించి అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణం తర్వాత ఇంటికి చేరుకున్న యువకుడికి మరుసటి రోజు రక్తస్రావం జరగడంతో, జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించాడు.
బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో యువకుడి కాలు విరిగిందని, అలాగే లైంగిక దాడి జరిగిందని వైద్యులు నిర్ధారించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్పందించిన జిల్లా ఎస్పీ చంద్రమోహన్.. నిందితులైన ఏఎస్సైలు సంజీవ్ కుమార్, రాజేందర్ కుమార్, హోంగార్డు సుమిత్‌లపై కేసు నమోదు చేసి వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక సిట్ (SIT) ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.








