రజకుల ఇళ్ల స్థలాల భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి
కొత్తగూడెం ఆగస్టు 03 (వై 7 న్యూస్);
గత కొన్నేళ్లుగా వెట్టి చాకిరి చేస్తూ నిలువ నీడ కోసం ప్రభుత్వాలతో పోరాడి గెలుచుకున్న రజకుల ఇళ్ల స్థలాలను కొంతమంది భూకబ్జాదారులు యధేచ్చగా ఆక్రమించుకుని రాజ్యమేలుతున్నారని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రజక సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పోగుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలువురు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం సర్వే నంబర్ 137/1 లోని రజకుల స్థలాలలో కొందరు ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1986లో ప్రభుత్వం రజకుల కోసం 5 ఎకరాల 20 కుంటల భూమి కేటాయించగా కొందరు ఇల్లు నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నామని, అది ప్రభుత్వ భూమిని గతంలో మండల తహసిల్దారు అందులో ఇల్లు నిర్మించుకోవడానికి వీల్లేదని చెప్పి పంచాయతీ కార్యదర్శి విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు ఇస్తే రజకులంతా ఏకమై హైకోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నామని తెలిపారు. సదరు హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఇంటి పన్నులు చెల్లిస్తూ కరెంటు కోసం అనుమతి తెచ్చి కరెంటు కూడా సప్లై తీసుకున్నామని, అక్కడ నివాసం ఉంటున్న పలువురు రజకులకు ఇళ్లను కేటాయించడం జరిగిందన్నారు. కానీ రజకులు పట్ల చుంచుపల్లి మండల తాసిల్దార్ కొందరు ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహిస్తూ రజకులు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ రజకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వారిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రజక సంఘం జేఏసీ నాయకులు బాపనపల్లి సత్యవతి, నిమ్మటూరి మోహనరావు, చిదిమల్ల రాజశేఖర్, కనతాల శ్రీన, ,లావణ్య తదితరులు పాల్గొన్నారు.