వే బిల్లులు ఉన్నా ఇసుక తరలింపుపై అడ్డంకులు!
బాన్సువాడ, జూలై 29 (Y7 న్యూస్ ప్రతినిధి):
పొతంగల్ మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ యజమానులు, కార్మికులు చెక్‌పోస్ట్ వద్ద నిరసనకు దిగారు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద జరిగిన ఈ ఆందోళనలో సుమారు వందలమంది పాల్గొన్నారు. వే బిల్లులు కలిగినప్పటికీ ట్రాక్టర్లు ఆపివేసి ఇసుక తరలింపును నిరోధించడం పట్ల వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పొతంగల్ మండలంలో సుమారు 80 మంది ట్రాక్టర్ యజమానులు, 200 మందికిపైగా కార్మికుల జీవనం పూర్తిగా ఇసుక తరలింపుపైనే ఆధారపడి ఉంది. మేం ఎలాంటి అక్రమాలు లేకుండా ప్రభుత్వానికి మంజూరైన అభివృద్ధి పనులకోసం, వే బిల్లులతోనే ఇసుకను తరలిస్తున్నాం. అయినా, కొంతమంది గ్రామస్తులు నమ్మశక్యం కాని ఆరోపణలు చేస్తూ మాపై నిందలు వేస్తున్నారు. ఇది మమ్మల్ని నాశనం చేయాలనే కుట్రగానే భావిస్తున్నాం అని తెలిపారు.
తాసిల్దార్ ఆదేశాలతోనే ట్రాక్టర్లు ఆపివేశారా?
నిరసనకారుల ప్రకారం, సోమవారం ఉదయం నుంచే తమ వద్ద వే బిల్లులు ఉన్నప్పటికీ తాసిల్దార్ గంగాధర్ ఆదేశాల మేరకు చెక్‌పోస్ట్ వద్ద ట్రాక్టర్లను ఆపివేసి ఇసుక తరలింపును నిలిపివేశారు. దీనితో వారి జీవనాధారం అస్తవ్యస్తమవుతోందని, వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కోడిచెర్ల గ్రామస్తులపై ఆరోపణలు:
పాత పోతంగల్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు, కొడిచెర్ల గ్రామంలోని కొంతమంది తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అక్రమ ఇసుక తరలింపుగా ప్రచారం చేస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
334 సర్వే నంబరులో ఉన్న భూమిని అధికారులు ప్రభుత్వ భూమిగా ఇప్పటికే గుర్తించారు. అయినా మాపై తప్పుడు ప్రచారం చేస్తూ మా పని నిలిపివేయడాన్ని ఎలా సమర్థించాలి? అని ప్రశ్నించారు.
వేబిల్లులు ఉన్నా అనుమతి లేని పరిస్థితి బాధాకరం:
చివరిగా ట్రాక్టర్ యజమానులు, కార్మికులు పేర్కొంటూ,ఇసుక తరలింపు మా జీవనాధారం. వేబిల్లులు ఉన్నప్పటికీ మాకు అనుమతి ఇవ్వకుండా చెక్‌పోస్ట్ వద్ద ట్రాక్టర్లు ఆపివేయడం అసహనానికి గురిచేస్తోంది. అధికార యంత్రాంగం కొడిచెర్ల లో కొంతమంది మాటలు వినకుండా, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి,” అని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో అనేకమంది ట్రాక్టర్ యజమానులు, కార్మికులు పాల్గొన్నారు. తాసిల్దార్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించడంతో పాటు, సమస్య పరిష్కారం కాకపోతే మరింత ముమ్మరంగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.