చింతూరు, (వై7 న్యూస్ తెలుగు) అక్టోబర్ 22:
చింతూరు డివిజన్ పరిధిలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పోలవరం జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఏ విధంగా జరుగుతోందో అధికారులను అడిగి ఆరా తీశారు. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను, బందోబస్తును ఆయన స్వయంగా తనిఖీ చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియను అత్యంత ప్రశాంత వాతావరణంలో, చట్టబద్ధంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ప్రతీ ఒక్కరూ విధిగా పాటించాలని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా పోలీసు ఆంక్షలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి మద్దతుదారులు అనవసరంగా గుంపులుగా చేరరాదని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు కేవలం 1+2 మందికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ నామినేషన్ సమయాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ కె. చక్రవర్తి తీవ్రంగా హెచ్చరించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









