శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 న్యూస్ తెలుగు
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సృష్టించి.. వాహనదారుడిపై దాడి చేసి.. అతడిని బలవంతంగా తీసుకెళ్లి ఆన్లైన్లో నగదు బదిలీ చేయించుకున్న ఇద్దరు నిందితులను కాశీబుగ్గ సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆటో, ద్విచక్ర వాహనం, మూడు స్మార్ట్ఫోన్లు, రూ.18,550 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో పలాస మండలం రామకృష్ణాపురం సమీపంలోని జాతీయ రహదారి NH-16పై ఈ ఘటన చోటుచేసుకుంది. ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆటోతో ఢీకొట్టిన అనంతరం అతడిపై దాడి చేసి, సెల్ఫోన్తో పాటు ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధితుడిని బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
బాధితుడి ఫోన్పే ఖాతా నుంచి ఒక నిందితుడి ఖాతాకు రూ.80,000, మరో నిందితుడి ఖాతాకు రూ.8,550 బదిలీ చేయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం రూ.88,550 నగదును ఆన్లైన్ ద్వారా బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 337/2026గా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 13న సాయంత్రం 5.30 గంటలకు పురుషోత్తపురం ప్రాంతంలోని A-1 ఇంటి వద్ద ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్టయిన వారిలో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురానికి చెందిన కిర్రి సాయికృష్ణ (23), పలాస మండలం కొత్తవూరుకు చెందిన గొర్లె రవితేజ (20) ఉన్నారు. వీరిద్దరూ గతంలో పలాస జెడ్పీ పాఠశాలలో కలిసి చదువుకున్న స్నేహితులని, తమ వ్యసనాల కోసం డబ్బు అవసరమై నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, మూడు స్మార్ట్ఫోన్లు, రూ.18,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కాశీబుగ్గ సబ్ డివిజన్ పోలీస్ అధికారి ప్రజలకు సూచించారు.
Y7 News Telugu | ప్రజల గొంతుక








