E-PAPER

ఆఫ్రికా చెల్లింపుల వ్యవస్థలో యూపీఐ.. భారత్‌తో జింబాబ్వే చర్చలు..

భారత్ అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సాంకేతికత అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందుతోంది. తాజాగా ఆఫ్రికా దేశమైన జింబాబ్వే తమ దేశ చెల్లింపుల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు యూపీఐ సాంకేతికతను వినియోగించుకోవడంపై భారత్‌తో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అంతర్జాతీయ విభాగమైన ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్)తో జింబాబ్వే సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది.

ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, జింబాబ్వేలోని బ్యాంకులు, మొబైల్ మనీ ఆపరేటర్లు, ఫిన్‌టెక్ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి రియల్ టైమ్ చెల్లింపులు జరిపేందుకు వీలు కలుగుతుంది. దీనివల్ల లావాదేవీల వ్యయం గణనీయంగా తగ్గడమే కాకుండా, నగదు బదిలీల వేగం కూడా పెరుగుతుందని జింబాబ్వే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జాన్ ముషయవాన్హు ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న మొత్తాల దేశీయ లావాదేవీలకు డెబిట్, క్రెడిట్ కార్డులకు ప్రత్యామ్నాయంగా ఇది నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్ఐపీఎల్‌తో సాగుతున్న ఈ చర్చలు ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం జింబాబ్వేలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగానే ఉంది. 2025 నాలుగో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 238 మిలియన్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలు నమోదు కాగా, వాటిలో 87 శాతం మొబైల్ మనీ ద్వారానే జరిగాయి. అయినప్పటికీ, ఈ లావాదేవీలకయ్యే ఖర్చు అధికంగా ఉంటోంది. ముఖ్యంగా విదేశాల నుంచి పంపే నిధులపై భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం, 2025లో ఆఫ్రికా దేశాలకు 200 డాలర్లు పంపడానికి సగటున 8 శాతం ఖర్చు అవుతుండగా, ప్రపంచ సగటు 6.5 శాతంగా ఉంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రకారం ఈ వ్యయం 3 శాతానికి మించకూడదు. యూపీఐ వంటి వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఈ ఖర్చులు తగ్గి, మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట పడనుంది.

భారత యూపీఐ టెక్నాలజీ 2025 నాటికి ప్రపంచంలోని మొత్తం రియల్ టైమ్ లావాదేవీలలో 49 శాతం వాటాను కలిగి ఉండటం దాని సామర్థ్యానికి నిదర్శనం. జింబాబ్వేతో పాటు ఘనా, ఉగాండా, రువాండా, మొజాంబిక్ వంటి ఇతర ఆఫ్రికా దేశాలు కూడా యూపీఐ టెక్నాలజీపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ దేశాలు యూపీఐని స్వీకరిస్తే, మిగతా ఆఫ్రికా దేశాలకు ఇవే ప్రమాణాలుగా మారే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!