E-PAPER

పండ్లపై స్టిక్కర్లు కనిపిస్తున్నాయా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

యాపిల్‌ కొనగానే స్టిక్కర్‌ తీసేసి, నీళ్లతో కడిగి తినేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! పండ్లపై ఉండే చిన్న స్టిక్కర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భారత ‘ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సూచించింది. స్టిక్కర్‌ తీసేసి పండును కడగడం మాత్రమే సరిపోదని, అది అంటించిన చోట ఉండే తొక్కను తీసేయాలని లేదా ఆ చిన్న భాగాన్ని కోసేయాలని తెలిపింది. ఎందుకంటే స్టిక్కర్‌ను అంటించేందుకు వాడే జిగురు పండుపై మిగిలిపోయే అవకాశం ఉంది.

స్టిక్కర్‌ తీసేస్తే సరిపోదా?
చాలామంది యాపిల్‌, ఆరెంజ్‌, అవకాడో వంటి పండ్లపై ఉండే స్టిక్కర్లను తీసేసి నేరుగా తింటుంటారు. కానీ స్టిక్కర్‌ తొలగించినంత మాత్రాన దాని కింద ఉన్న ప్రాంతం పూర్తిగా శుభ్రమైందని భావించకూడదు. జిగురు అవశేషాలు అక్కడే ఉండొచ్చు. అందుకే ఆ ప్రాంతంలోని తొక్కను తొలగించడం లేదా చిన్న ముక్కను కోసేయడం మంచిది. ఈ జిగురు కెమికల్స్‌తో తయారవుతుంది. దాని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

పండ్లపై స్టిక్కర్లు ఎందుకు పెడతారు?
సూపర్‌మార్కెట్లలో పండ్లపై కనిపించే ఇవి లేబుళ్లలా ఉపయోగపడతాయి. వాటిపై ఉండే కోడ్‌లతో పండ్ల రకం, ధర వంటి వివరాలను విక్రేతలు గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో నాణ్యత, బ్రాండ్‌ వంటి ఇతర సమాచారాన్ని కూడా అందిస్తాయి. స్టిక్కర్‌ సులభంగా ఊడిపోయినా దాని జిగురు పూర్తిగా తొలగిపోయిందని అనుకోకూడదు.

పండ్లను కడిగితే సరిపోదా?
పండ్లు, కూరగాయలను తినే ముందు శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం. కానీ స్టిక్కర్‌ అంటించిన చోట అదనపు జాగ్రత్త అవసరం. ముందుగా స్టిక్కర్‌ను తొలగించాలి. తర్వాత ఆ ప్రాంతంలోని తొక్కను తీసేయాలి లేదా చిన్న భాగాన్ని కోసేయాలి. తొక్క తీయకుండా యాపిల్‌ తినాలనుకున్నా, స్టిక్కర్‌ ఉన్న చోటును చిన్నగా కోసి తొలగించవచ్చు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!