పలాస, అక్టోబర్ 7 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా చిన్న గురుదాసుపురం జంక్షన్ పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులు, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దని స్థానిక గ్రామస్థులు కోరారు.
చిన్న గురుదాసుపురం, కొబ్బరి చెట్టులారు, చిన్నమామిడిమెట్టు గ్రామాలకు చెందిన ప్రజలు బుధవారం కాశీబుగ్గ ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
తమ గ్రామాలను మద్యరహిత గ్రామాలుగా కొనసాగించాలని గ్రామసభలో ఇప్పటికే తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. గ్రామాల్లో మద్యం విక్రయాలు పెరగడం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతినడంతో పాటు కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల చిన్న గురుదాసుపురం జంక్షన్ వద్ద ఎలాంటి బెల్ట్ షాపులు లేదా ప్రభుత్వ మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను గ్రామస్థులు కోరారు.








