బూర్గంపాడు, అక్టోబర్ 7: సారపాకలో అక్టోబర్ 11న నిర్వహించనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
బుధవారం బూర్గంపాడులోని సంఘం మండల కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. అక్టోబర్ 11న జరిగే శిక్షణ తరగతులకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, జాతీయ కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.
వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు, పోడు భూముల సమస్యలపై తమ సంఘం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని వారు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వారు విమర్శలు చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పోడు భూముల పట్టాలను వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎస్కే అబీద్, కమటం మరియమ్మ, బయ్య రాము, తిరుపతిరావు, ముంగి శివ తదితరులు పాల్గొన్నారు.
– Y7 News Telugu







