శిల్పి నగర్‌లో ఇళ్లను లాడ్జీలుగా నిర్మిస్తున్నారంటూ ఆరోపణలు.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
భద్రాచలం, అక్టోబర్ 3: పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై భద్రాచలంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రాచలం పట్టణంలోని శిల్పి నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు తమకు మంజూరైన ఇళ్లను నివాస అవసరాలకు కాకుండా లాడ్జీల తరహాలో నిర్మిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
పేదలకు నివాసం కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఇళ్లను వ్యాపార అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమా? కాదా? అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
ఇళ్ల నిర్మాణం జరుగుతున్న సమయంలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తున్నారా? నిర్మాణ దశల్లో మంజూరయ్యే బిల్లులకు ముందు నిబంధనల ప్రకారం తనిఖీలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు ఏ విధంగా వినియోగించుకోవచ్చనే అంశంపై ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను అధికారులు పరిశీలించి, శిల్పి నగర్‌లోని నిర్మాణాలపై వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో శిల్పి నగర్‌లో జరుగుతున్న నిర్మాణాలపై జిల్లా కలెక్టర్, ఆర్డీవో, సంబంధిత పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముద్దా పిచ్చయ్య కోరారు.
అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత లబ్ధిదారులు, అధికారులు స్పందించాల్సి ఉంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయా? లేదా? అనేది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.








