E-PAPER

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త స్మార్ట్ ఫోన్స్ ఇవే..!

గత సెప్టెంబర్‌లో భారత మార్కెట్‌లోకి ఎన్నో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ఇక పండుగ సీజన్‌కు ముందు అక్టోబర్‌లో కూడా Vivo, Oppo, Motorola నుంచి మరికొన్ని కొత్త ఫోన్లు లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఫోన్లలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దాం.

మొదటగా Oppo F35 సిరీస్.

Oppo F35 సిరీస్ అక్టోబర్ 5న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో F35, F35 Pro మోడళ్లు వచ్చే అవకాశం ఉంది. సెల్ఫీ కెమెరా, వీడియో రికార్డింగ్, డిజైన్‌పై కంపెనీ ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

F35 Proలో 6.78 అంగుళాల 1.5K LTPS OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 4 Gen 5 ప్రాసెసర్, భారీ 10,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా.

ధర విషయానికి వస్తే.. లీకుల ప్రకారం F35 Pro ధర సుమారు రూ.44 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ఇక స్టాండర్డ్ F35 ధర రూ.37,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇవి అధికారిక ధరలు కావు.

ఇక Vivo V80 విషయానికి వస్తే..

Vivo V80 అక్టోబర్ 6న భారత్‌లో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇది Vivo V70కు తదుపరి మోడల్‌గా రానుంది.

ఈ ఫోన్‌లో 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కెమెరా విభాగంలో 50MP మెయిన్ కెమెరా, 50MP నైట్ టెలిఫొటో కెమెరా, Zeiss కెమెరా సిస్టమ్‌తో పాటు 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉండనుంది.

ఇక బ్యాటరీ విషయంలో Vivo భారీ అప్‌గ్రేడ్ ఇచ్చింది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7,200mAh బ్యాటరీ ఇందులో ఉండనుంది.

లీకుల ప్రకారం Vivo V80 ప్రారంభ ధర సుమారు రూ.63 వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది. అయితే అధికారిక ధర లాంచ్ సమయంలోనే క్లారిటీ వస్తుంది.

Vivo S2 FE కూడా అదే రోజు..

Vivo V80తో పాటు S2 FE కూడా అక్టోబర్ 6న భారత్‌లోకి రానున్నట్లు సమాచారం.

ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, MediaTek Dimensity 7300e 5G చిప్‌సెట్, 50MP మెయిన్ కెమెరా, IP68/IP69 రేటింగ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది.

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇందులో 10,000mAh భారీ బ్యాటరీ ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి.

ధర విషయానికి వస్తే.. 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ బాక్స్ ధర రూ.39,999గా లీకైంది. అయితే అసలు రిటైల్ ధర దీనికంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇక Vivo X Fold 6..

Vivo నుంచి మరో ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ X Fold 6 కూడా ఆసక్తిని పెంచుతోంది. అయితే దీని లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

లీకుల ప్రకారం ఇందులో 8.02 అంగుళాల 120Hz ఇన్నర్ డిస్‌ప్లే, 6.51 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండొచ్చు. అలాగే MediaTek Dimensity 9500 Super Edition చిప్‌సెట్, OISతో కూడిన 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్, 50MP పెరిస్కోప్ కెమెరాలు ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ కూడా 6,900mAh నుంచి 7,000mAh వరకు ఉండొచ్చని సమాచారం.

చివరిగా Motorola Edge 70 Neo..

అక్టోబర్‌లో Motorola Edge 70 Neo కూడా భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికారిక లాంచ్ తేదీ ఇంకా వెల్లడించకపోయినా, Android 17 బీటా సైన్-అప్ పేజీలో ఈ ఫోన్ కనిపించడం ఆసక్తిని పెంచింది.

లీకుల ప్రకారం Snapdragon 7s Gen 3 ప్రాసెసర్, 6GB RAMతో పాటు స్లిమ్ డిజైన్, Motorolaకు ప్రత్యేకమైన క్లీన్ Android అనుభవం ఇందులో ఉండొచ్చని తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే.. ఈ అక్టోబర్‌లో Vivo, Oppo, Motorola నుంచి బడ్జెట్ నుంచి ప్రీమియం ఫోల్డబుల్ సెగ్మెంట్ వరకు పలు కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే వీటిలో కొన్ని వివరాలు ఇంకా లీకులు, అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. కాబట్టి ఫైనల్ ఫీచర్లు, ధరల కోసం అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!