బజాజ్ ఆటో సంస్థ తన అప్‌డేటెడ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో ఈ బైక్‌ను అప్‌డేట్ చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,90,015గా నిర్ణయించింది.
ఇప్పటివరకు ఉన్న కలర్ ఎల్‌సీడీ స్క్రీన్ స్థానంలో కొత్త టీఎఫ్‌టీ డిస్‌ప్లే వచ్చింది. ఇందులో గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ సదుపాయం ఉంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, డాక్యుమెంట్ స్టోరేజ్, ల్యాప్ టైమర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
రైడర్లు నాలుగు రైడింగ్ మోడ్‌లను డిస్‌ప్లే ద్వారానే మార్చుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్‌ను కూడా నియంత్రించవచ్చు. బ్లూటూత్ ద్వారా ఫోన్‌ను బైక్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్టును కూడా ఇచ్చారు.
హార్డ్ బ్రేకింగ్ సమయంలో వెనుక నుంచి వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేందుకు ‘పానిక్ బ్రేక్ అలర్ట్’ సిస్టమ్‌ను కూడా జోడించారు. బైక్ ఒక్కసారిగా గట్టిగా బ్రేక్ వేస్తే హజార్డ్ లైట్లు వెలుగుతాయి.
కొత్త టీఎఫ్‌టీ డిస్‌ప్లేను బజాజ్ ఈ ఏడాది పల్సర్ సిరీస్‌లో క్రమంగా తీసుకొస్తోంది. ఎన్160 ఎస్‌ఎస్, పల్సర్ 125, పల్సర్ 150 తర్వాత ఇప్పుడు ఎన్‌ఎస్400జెడ్‌లోనూ ఈ ఫీచర్‌ను అందించింది.
బైక్ ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. 349 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 40 హెచ్‌పీ శక్తిని, 33 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. 43 మి.మీ. యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, రేడియల్ టైర్లు, ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.








