E-PAPER

రూ.1,499కే జియో ఫోన్‌.. 6 నెలల పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డేటా…!

పండగ సీజన్‌ వేళ జియో వినియోగదారులకు బంపరాఫర్‌ ప్రకటించింది. సంస్థ పదో వార్షికోత్సవం సందర్భంగా కేవలం రూ.1,499కే 4జీ ఫీచర్‌ ఫోన్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఆరు నెలల పాటు ఉచిత రీఛార్జ్‌ ప్రయోజనాలను కల్పిస్తోంది. అన్‌లిమిటెడ్‌ హెచ్‌డీ వాయిస్‌ కాల్స్‌తో పాటు ప్రతి నెలా 14 జీబీ డేటా అందించనుంది. ముఖ్యంగా ఇప్పటికీ 2జీ ఫోన్లు వాడుతున్నవారు 4జీకి మారేందుకు ఈ ఆఫర్‌ ఉపయోగపడనుంది.

జియో పదో వార్షికోత్సవం సందర్భంగా పరిమిత కాలానికి ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. అయితే ఏయే జియోభారత్‌ మోడళ్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందో సంస్థ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం రూ.199 నెలవారీ రీఛార్జ్‌ చేసుకునే వినియోగదారులు ఆరు నెలలకు దాదాపు రూ.1,200 ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే మొత్తాన్ని ఫోన్‌ ధరలోనే కలిపి ఆఫర్‌ అందిస్తున్నట్లు జియో చెబుతోంది. ఈ లెక్కన ఫోన్‌ అసలు ధర రూ.299కే లభించినట్లవుతుందని సంస్థ పేర్కొంది.

జియోభారత్‌ ఫోన్లలో వినోదానికి కూడా పెద్దపీట వేసింది. జియోటీవీ ద్వారా 500కు పైగా ఛానళ్లను వీక్షించవచ్చు. జియోహాట్‌స్టార్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు, సినిమాలు, ఇతర కార్యక్రమాలను చూడొచ్చు. లక్షలాది పాటలను వినే సదుపాయం కూడా ఉంది. అంతేకాదు.. జియోపే ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. చెల్లింపుల అలర్ట్‌లు, సౌండ్‌బాక్స్‌ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

కుటుంబ సభ్యుల భద్రత కోసం జియో సేఫ్టీ షీల్డ్‌ ఫీచర్‌ను అందిస్తోంది. సురక్షితమైన కాలింగ్‌తో పాటు కుటుంబ సభ్యుల లొకేషన్‌ను తెలుసుకునే సదుపాయాలు ఉన్నాయి. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 2,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు జియోభారత్‌ బీ1, బీ2 మోడళ్లలో ఉన్నాయి. అయితే ఈ మోడళ్లకు వార్షికోత్సవ ఆఫర్‌ వర్తిస్తుందా లేదా అనేది జియో స్పష్టం చేయాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!