20 ఏళ్ల అనుభవం ఉన్నా కార్డు కోసం ఎదురుచూపులే
అక్రిడిటేషన్ లేక సంక్షేమ ప్రయోజనాలకు దూరం
కలెక్టరేట్ ఎదుట వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 29 (Y7 న్యూస్):
ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టుల సమస్యే నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. అక్రిడిటేషన్ కార్డుల కోసం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలు గడిచినా కార్డులు అందకపోవడంతో వర్కింగ్ జర్నలిస్టులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.


జిల్లాలో అనేక సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న పలువురు జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. అయితే నెలలు గడుస్తున్నా దరఖాస్తుల పరిశీలన, కార్డుల జారీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండు దశాబ్దాలుగా జర్నలిజం రంగంలో కొనసాగుతున్న జర్నలిస్టులు సైతం అక్రిడిటేషన్ కార్డుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
కార్డు లేక సంక్షేమ ప్రయోజనాలకు దూరం
అక్రిడిటేషన్ కార్డు కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాకుండా జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అందే పలు సంక్షేమ ప్రయోజనాలతో ముడిపడి ఉందని ఆందోళనకారులు తెలిపారు. కార్డుల జారీ ఆలస్యం కారణంగా హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ సదుపాయాలను పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తులపై నాలుగు నెలలుగా జాప్యం ఎందుకు జరుగుతోందని వారు ప్రశ్నించారు. అర్హత కలిగిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పెండింగ్ ప్రక్రియను పూర్తి చేసి కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం
ధర్నా అనంతరం జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ అంకిత్‌ను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి వెంటనే కార్డులు జారీ చేయాలని కోరారు.
జర్నలిస్టుల వినతిపై స్పందించిన కలెక్టర్ అంకిత్ సంబంధిత సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులను పిలిపించి అక్రిడిటేషన్ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్డుల మంజూరుకు సంబంధించి అవసరమైన అనుమతులు రావాల్సి ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించినట్లు తెలిసింది.
పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ దరఖాస్తుల అంశాన్ని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో నెలల తరబడి కొనసాగుతున్న సమస్యపై అధికార యంత్రాంగం దృష్టి సారించడంతో త్వరలో పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని జర్నలిస్టులు వ్యక్తం చేశారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో జర్నలిస్టులు మొగిలిపాక మురళీకృష్ణ, చింతల చిరంజీవి, కొండ జంపన్న తదితరులు పాల్గొన్నారు. ధర్నాకు సంఘీభావంగా TUWJ-IJOU యూనియన్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి, 10 టీవీ నాగచంద్ర, కోలా కుమార్‌తో పాటు పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.








