న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు
పలాస, Y7 న్యూస్:
పలాస రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ (RPF), జీఆర్పీ (GRP) సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్‌ఫాం నంబర్-2 ఉత్తర వైపున రెండు బ్యాక్‌ప్యాక్ బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, ఆమె వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో 7 ప్యాకెట్లలో 11 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, పట్టుబడిన మహిళను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పుర్బా బర్ధమాన్ జిల్లాకు చెందిన నౌబహర్బీబీ షేక్ (34)గా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని అధికారులు సీజ్ చేసి, మహిళను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై పలాస ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లో రైల్వే ఎస్ఐ డి. శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితురాలిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. రైల్వే స్టేషన్లలో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.









