E-PAPER

‘భారతీయులతో బిజినెస్‌ కష్టం..?’ చైనా ట్రేడర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ ట్రేడర్‌ జే చెన్‌ భారతీయ క్లయింట్లతో వ్యాపారం చేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. గ్లోబల్‌ సోర్సింగ్‌, ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్స్‌ రంగంలో పనిచేసే చెన్‌.. కొందరు భారతీయ కొనుగోలుదారులతో డీల్‌ చేసుకోవడం కష్టంగా ఉంటుందని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో చర్చకు దారితీశాయి.

చెన్‌ ప్రకారం.. భారతీయ కస్టమర్లు ధర విషయంలో ఎక్కువగా బేరసారాలు చేస్తారని చెప్పారు. తాను చెప్పిన ధర ఎక్కువగా ఉందని చెబుతూ, ఆర్డర్‌ పెట్టకముందే ప్రొడక్ట్‌ శాంపిల్స్‌ అడుగుతుంటారని తెలిపారు. కొందరు చైనా విక్రేతలు భారతీయ కొనుగోలుదారుల విషయంలో మోసపూరిత క్లయింట్లు ఉండొచ్చనే భయంతో జాగ్రత్తగా ఉంటారని కూడా ఆయన పేర్కొన్నారు.

అయితే భారత్‌తో తన తొలి అంతర్జాతీయ ఆర్డర్‌ అనుభవం మాత్రం చాలా సానుకూలంగా సాగిందని చెన్‌ చెప్పారు. తన మొదటి విదేశీ ఆర్డర్‌ భారతీయ కస్టమర్‌ నుంచే వచ్చిందని, ఆ కొనుగోలుదారు తన అంతర్జాతీయ వ్యాపారం ప్రారంభించడానికి సహాయపడ్డారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పలువురు.. భారత్‌లో మార్కెట్‌ పెద్దదిగా, పోటీ ఎక్కువగా ఉండటంతో కస్టమర్లు ధరలను పోల్చి చూసి కొనుగోలు చేస్తారని చెప్పారు.

మరికొందరు మాత్రం శాంపిల్స్‌ అడగడం, ధరలపై చర్చించడం అంతర్జాతీయ సోర్సింగ్‌లో సాధారణమేనని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొందరు చైనా సరఫరాదారులపైనా ఆరోపణలు చేశారు. మొదట మంచి నాణ్యత గల శాంపిల్స్‌ పంపి, ఆ తర్వాత తక్కువ నాణ్యత ఉన్న ఉత్పత్తులు పంపుతున్నారని ఓ యూజర్‌ ఆరోపించారు. మరో యూజర్‌ భారతీయ క్లయింట్లతో వ్యాపారం కష్టంగా ఉండటానికి కారణం వారు మరింత తెలివిగా వ్యవహరించడమేనని వ్యాఖ్యానించారు. ఇంకొందరు ఫ్యాక్టరీని స్వయంగా సందర్శించడం, శాంపిల్స్‌ తీసుకుని కొంతకాలం ఉపయోగించి నాణ్యతను పరిశీలించడం మంచిదని చెప్పారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!