E-PAPER

యూపీఐ ఛార్జీలపై ఎన్‌పీసీఐ కీలక ప్రకటన..!

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చేసే చెల్లింపుల్లో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌) పై జీఎస్టీ విధిస్తారని, దీనివల్ల డిజిటల్ చెల్లింపులు ఖరీదుగా మారతాయని, ముఖ్యంగా చిన్న వ్యాపారులపై భారం పడుతుందని కొన్ని మీడియా మాధ్యమాలలో వస్తున్న వార్తలను ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్‌పీసీఐ) ఖండించింది. ఈ ఆందోళనలు పూర్తిగా అవాస్తవమని, అపోహలు మాత్రమేనని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ఎన్‌పీసీఐ వివరణ ప్రకారం, ఎండీఆర్‌ అనేది కేవలం రూ.2,000 కంటే ఎక్కువ విలువైన ‘పర్సన్-టు-మర్చంట్’ (పీ2ఎం) లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. రూ.2,000 వరకు జరిపే లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్‌ లేనందున, వాటిపై జీఎస్టీ ప్రభావం కూడా ఉండదని స్పష్టం చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో జరిగే మొత్తం యూపీఐ మర్చంట్ లావాదేవీల్లో 96% పైగా రూ.2,000 లోపువేనని, అందువల్ల అత్యధిక లావాదేవీలపై ఈ మార్పు ప్రభావం ఏమాత్రం ఉండదని పేర్కొంది.

అంతేకాకుండా, నెలకు లక్ష రూపాయల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులు ఎండీఆర్‌ చెల్లించాల్సిన అవసరం లేదని, కాబట్టి వారికి జీఎస్టీ సమస్యే ఉత్పన్నం కాదని తెలియజేసింది. ఒకవేళ రూ.2,000 పైబడి లావాదేవీలు జరిపి ఎండీఆర్‌ చెల్లించే వ్యాపారులు దానిపై జీఎస్టీ కట్టినా, ఆ మొత్తాన్ని వారు విక్రయించే వస్తువులపై చెల్లించాల్సిన జీఎస్టీ నుంచి మినహాయింపు (ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్) పొందవచ్చని వివరించింది. ఫలితంగా, వ్యాపారులపై ఈ జీఎస్టీ భారం వాస్తవానికి ఉండదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.

వ్యక్తుల మధ్య జరిగే ‘పర్సన్-టు-పర్సన్’ (పీ2పీ) లావాదేవీలపై ఈ నిబంధనల ప్రభావం ఏమాత్రం ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. ఎంత మొత్తం బదిలీ చేసినా ఈ లావాదేవీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి. ఎండీఆర్‌ అనేది ప్రభుత్వం లేదా ఎన్‌పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, యూపీఐ వ్యవస్థ నిర్వహణ, విస్తరణకు సహకరించేందుకు బ్యాంకులు, పేమెంట్ యాప్ ప్రొవైడర్ల వంటి భాగస్వాములకు పంచే రుసుము అని కూడా వివరించింది.

కొత్త నిబంధనల ప్రకారం రూ.2,000 దాటిన పీ2ఎం లావాదేవీలపై 0.4% నామమాత్రపు ఎండీఆర్‌ వర్తిస్తుంది. రూ.75,000, ఆపైబడిన లావాదేవీలకు ఎండీఆర్‌ గరిష్ఠంగా రూ.300గా పరిమితం చేశారు. రైల్వే, టెలికాం, ఇంధనం, వ్యవసాయం వంటి అత్యవసర, తక్కువ మార్జిన్లు ఉండే రంగాల్లో రూ.2,000 దాటిన లావాదేవీలకు ఒక్కోదానికి కేవలం రూ.5 ఫ్లాట్ ఛార్జీ వర్తిస్తుందని ఎన్‌పీసీఐ తెలిపింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!