వందేమాతరం గీతాలాపనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గేయంలోని ఎన్ని చరణాలు పాడాలన్నది పూర్తిగా పౌరుల వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వందేమాతం గేయంలోని ఆరు చరణాలను ఆలపించాని మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ సంగీత విద్వాంసుడు టీ.ఎం.కృష్ణ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వందేమాతర గీతంలోని చివరి నాలుగు చరణాల్లో హిందూ దేవతలను ఉద్దేశించిన అంశాలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. వాటిని తప్పనిసరిగా పాడేలా చేయటం రాజ్యాంగంలోని లౌకిక విలువలకు విరుద్ధమని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా.. ఓ నిర్ధిష్ట మతపరమైన సందేశాన్ని ప్రోత్సహించేలా చట్ట సవరణ ఉందని ఆయన తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.
దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వందేమాతరం గీతంలోని అన్ని చరణాలు పాడని వారిపై చర్యలు తీసుకోలేరని స్పష్టం చేసింది. పూర్తి వందేమాతరం గీతాన్ని పాడని వారిపై కేంద్రం తీసుకునే చర్యల అంశాన్ని పరిశీలించేందుకు అంగీకరించింది. వందేమాతరం సవరణ చట్టం, మార్గదర్శకాలపై రెండు వారాల్లోనే సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
మరో కేసులో వ్యక్తిగత స్వేచ్ఛ, పౌరుల హక్కుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎవరినైనా అరెస్టు చేసినపుడు దానికి గల కారణాలను లిఖితపూర్వకంగా అవతలి వ్యక్తికి అర్థమయ్యే భాషలో తప్పనిసరిగా తెలియచేయాలని పేర్కొంది. అలా చేయని పక్షంలో ఆ అరెస్టు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అవుతుందని తేల్చిచెప్పింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1), ఆర్టికల్ 21 కింద పౌరులకు లభించిన ప్రాథమిక హక్కు అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్ ధర్మాసనం పేర్కొంది.
పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్ నేత జస్ కరణ్ జీత్ సింగ్ డియోల్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేసిన కేసులో ఈ తీర్పును వెలువరించింది. గత ఏడాది మే 17న పంజాబ్ పోలీసులు ఆయనను అరెస్టు చేసినపుడు కారణాలను లిఖితపూర్వకంగా ఇవ్వలేదు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించి అరెస్టును రద్దు చేసింది. ఈ నిబంధన కేవలం సాధారణ ఐపీసీ కేసులకే కాకుండా పోక్సో, పీఎంఎల్‌ఏ, ఉపా వంటి కఠినమైన ప్రత్యేక చట్టాల కింద చేసే అరెస్టులకు కూడా వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది







