అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక H-1B వీసా దరఖాస్తులపై అదనంగా 1,03,265 అమెరికన్ డాలర్ల రుసుమును విధించాలని ప్రతిపాదించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.86 లక్షలకు పైగా ఉంటుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయ టెక్ నిపుణులతో పాటు వారిని స్పాన్సర్ చేసే అమెరికన్ కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇటీవల ఈ అంశంపై అధికారిక నోటీసు విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ H-1B వీసా దరఖాస్తు రుసుములకు అదనంగా ఈ కొత్త ఫీజును వసూలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణుల్లో ఆందోళన నెలకొంది.
అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్ లేదా అంతకంటే ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీయులకు కేటాయించే 20,000 అదనపు H-1B వీసాల కేటగిరీకి కూడా ఈ కొత్త నిబంధన వర్తించే అవకాశం ఉంది. గతంలో కోర్టులు తిరస్కరించిన ప్రతిపాదనల స్థానంలో ప్రభుత్వం కొత్త సవరణలను తీసుకురావడం గమనార్హం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే H-1B వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగం పొందాలనుకునే భారతీయులకు ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది.








