అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా థియేటర్లలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఆగస్టు 7న జీ5లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటింది. దీంతో ‘లెనిన్’ ఓటీటీ పెర్ఫార్మెన్స్‌పై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంది. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
రాయలసీమలోని చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలో జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్ల నేపథ్యంలో ‘లెనిన్’ కథ సాగుతుంది. ప్రాణ స్నేహితుడి ద్రోహం కారణంగా లెనిన్ జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు, అతను జైలుకు వెళ్లడానికి దారితీసిన పరిస్థితులు, రామచంద్రపురంలో జరిగిన ఘర్షణలో చివరికి ఎవరు గెలిచారనే అంశాలు కథలో కీలకంగా ఉంటాయి. ఓటీటీలో రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది.









