మాస్ మహారాజ రవితేజ హీరోగా, ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంలో ఉంటుందని అభిమానులు భావించగా, దర్శకుడు శివ నిర్వాణ కీలక క్లారిటీ ఇచ్చారు. ‘ఇరుముడి’ శబరిమల యాత్ర, అయ్యప్ప దర్శనం లేదా పూర్తిగా ఆధ్యాత్మిక అంశాల చుట్టూ తిరిగే భక్తి చిత్రం కాదని, కథలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపారు.
అయ్యప్ప మాల ధారణలో కీలకమైన 41 రోజుల దీక్షను కథలో ఒక ముఖ్యమైన అంశంగా తీసుకున్నట్లు దర్శకుడు వెల్లడించారు. దీక్షకు ముందు హీరో జీవితంలో ఏం జరిగింది? దీక్ష సమయంలో అతడి జీవితంలో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే అంశాల చుట్టూ కథ సాగుతుందని తెలిపారు. మొదట ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ప్రారంభమయ్యే ఈ సినిమా, క్రమంగా ప్రేక్షకులు ఊహించని మలుపులతో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా మారుతుందని చెప్పారు.
కథ ముందుకు సాగుతున్న కొద్దీ తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకులను వెంటాడేలా స్క్రీన్‌ప్లే ఉంటుందని శివ నిర్వాణ పేర్కొన్నారు. సీరియస్ ట్రీట్‌మెంట్‌తో సాగే మిస్టరీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడంతో పాటు మైండ్ బెండింగ్ అనుభూతిని కలిగిస్తాయని తెలిపారు. చివర్లో థ్రిల్లింగ్ మిస్టరీకి హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ ముగింపు ఉంటుందని, థ్రిల్‌తో పాటు డీప్ ఎమోషన్స్ కోరుకునే ప్రేక్షకులకు ‘ఇరుముడి’ ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని అన్నారు.









