2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మ్యాగీ నూడుల్స్ వివాదానికి సంబంధించి నమోదైన రెండు క్రిమినల్ కేసులను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేసులకు ఆధారంగా ఉన్న శాస్త్రీయ నివేదికల ప్రామాణికత తదుపరి పరిణామాలతో గణనీయంగా బలహీనపడిన నేపథ్యంలో.. విచారణను కొనసాగించడం చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ మధు జైన్ ధర్మేంద్ర హన్స్రాజ్ కోటక్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ.. 2015 నవంబర్ 6, 2016 జనవరి 11న ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లతో పాటు, అనంతరం జరిగిన అన్ని చర్యలను రద్దు చేశారు.
2015 మేలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆహార ఉత్పత్తుల తనిఖీల్లో భాగంగా ఢిల్లీ ఫుడ్ సేఫ్టీ విభాగం మ్యాగీ నూడుల్స్ నమూనాలను సేకరించింది. వాటిని పరీక్షించిన ఫుడ్ అనలిస్ట్.. మ్యాగీ మసాలా టేస్ట్‌మేకర్‌లో లీడ్ పరిమాణం నిర్దేశిత 2.5 పీపీఎం పరిమితిని మించిందని నివేదించారు. ఈ నివేదిక ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 కింద క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో అప్పట్లో మ్యాగీ నూడుల్స్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది.
మరో కేసులో మ్యాగీ ప్యాకెట్‌పై ‘No Added MSG’ అనే ప్రకటనకు సంబంధించి తప్పుదారి పట్టించే లేబులింగ్ ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఆరోపణల ఆధారంగా కూడా క్రిమినల్ చర్యలు చేపట్టారు. అయితే ఆ తర్వాత వివిధ న్యాయస్థానాల్లో జరిగిన పరిణామాలు.. ఈ కేసులకు ప్రాథమిక ఆధారంగా ఉన్న నివేదికల విశ్వసనీయతను ప్రభావితం చేశాయని ఢిల్లీ హైకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో కేసులను ముందుకు తీసుకెళ్లడం సమంజసం కాదని పేర్కొంటూ.. సంబంధిత క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు ముగింపు పలికింది.







