ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా విడుదలైనప్పటి నుంచి తన ఫోన్ నిరంతరం మోగుతూనే ఉందని, చాలామంది ‘మీ అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేది’ అని చెబుతున్నారని తెలిపారు. అయితే తన అమ్మ ఎక్కడ ఉన్నా తన విజయాన్ని చూస్తూనే ఉంటుందని తాను నమ్ముతున్నానని ఎమోషనల్‌గా చెప్పారు.
ఒక తెలుగు అమ్మాయిగా మంచి కంటెంట్ ఉన్న పాత్రలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని గౌరీ ప్రియ పేర్కొన్నారు. సింగిల్ స్క్రీన్‌లతో పాటు మల్టీప్లెక్స్‌లలో కూడా సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని, ముఖ్యంగా యువతులు తన పాత్రతో కనెక్ట్ అవుతూ పెద్ద సంఖ్యలో సందేశాలు పంపుతున్నారని తెలిపారు. ఈ విజయానికి నిర్మాత ఎస్‌కేఎన్ ఇచ్చిన ప్రోత్సాహమే ప్రధాన కారణమని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ మొగిల్నేని మాట్లాడుతూ సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన బలమని చెప్పారు. అనంత శ్రీరామ్ సాహిత్యం సినిమాను మరింత బలపరిచిందన్నారు. దర్శకుడు సాయి రాజేష్ కథ విషయంలో ఎలాంటి రాజీ పడరని, హీరో కిరణ్ అబ్బవరం షూటింగ్ మొత్తం ఎంతో సహకరించారని తెలిపారు. గౌరీ ప్రియ పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించిందని, అందుకే ఆమెకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు.








