భద్రాచలం పట్టణంలోని MIM ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంతెలబోరు గ్రామ సర్పంచ్ సోడి వెంకటరమణ మృతి చెందడం బాధాకరమని CPIML మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కమిటీ పేర్కొంది.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, భద్రాచలంలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. MIM ఆసుపత్రిలో జరిగిన తాజా ఘటనపై వైద్యశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రోగులకు సరైన వైద్యం అందుతోందా లేదా అనే అంశంపై సమగ్ర దర్యాప్తు జరగాలని, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భద్రాచలంలో పునరావృతమవుతున్న వైద్య సంబంధిత వివాదాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
అడిషనల్ డీఎంహెచ్‌వో, డీఎంహెచ్‌వోతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఈ ఘటనపై స్పందించి ప్రజలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పరిస్థితులు ఎక్కడా ఉండకూడదని, అవసరమైతే ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించేలా సంబంధిత ఆసుపత్రిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని CPIML మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది.
– CPIML మాస్ లైన్ పార్టీ, భద్రాచలం డివిజన్ కమిటీ









