పోలవరం, జూలై 24 (వై7 న్యూస్): చింతూరు డివిజన్ ఎటపాక మండలంలోని గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు గోదావరిలో చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు.
రంపచోడవరం పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం మంత్రి నారా లోకేశ్ ఇటీవల గోదావరిలో చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఊకె సుశీల, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్ కుటుంబ సభ్యులను కలిశారు. బాధిత కుటుంబాలతో కలిసి అల్పాహారం స్వీకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, భవిష్యత్తులో ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యం నింపారు.
కాగా, మృతుల కుటుంబాలకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, పార్టీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.








