E-PAPER

ముఖ్యమంత్రి పర్యటనతో ఏజెన్సీకి సాధించిందేమిటి?

ఆదివాసీ గొంతు నొక్కి డబ్బా కొట్టుకోవడానికే సీఎం పర్యటించారా? – ASP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను

రంపచోడవరం, జూలై 24 (వై7 న్యూస్): ముఖ్యమంత్రి రంపచోడవరం పర్యటన కేవలం ప్రభుత్వ ప్రచార కార్యక్రమానికే పరిమితమైందని, ఏజెన్సీ ఆదివాసులు ఎదుర్కొంటున్న భూమి, ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య వంటి కీలక సమస్యలను సీఎం దృష్టికి వెళ్లకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఆరోపించారు.

రంపచోడవరంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, సీఎం పర్యటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కుంజ శ్రీను మాట్లాడుతూ, మెగా పేరెంట్స్ మీటింగ్‌లు, పార్టీ సమావేశాలతో ప్రభుత్వమే తనను తాను ప్రశంసించుకునే కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. ఏజెన్సీలో ఆదివాసులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను పక్కనపెట్టి ప్రజాధనంతో నిర్వహించిన ఈ పర్యటన వల్ల గిరిజనులకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రికి నిజాయితీగా వివరించరని, ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న నాయకులకు కనీసం రెండు మూడు నిమిషాల సమయం ఇచ్చి ఉంటే అసలు పరిస్థితులు సీఎం దృష్టికి వెళ్లేవని అన్నారు.

తమ ఖండన పోలీసులపై కాదని, పోలీసులను ఆయుధంగా ఉపయోగించుకున్న ప్రభుత్వ నిరంకుశ వైఖరిపైనేనని ఆయన స్పష్టం చేశారు. ఆదివాసీ నాయకులను పోలీస్ స్టేషన్‌లో నిలిపివేసి, వినతిపత్రం కూడా ఇవ్వనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

రంపచోడవరం పోలీసులు తమ వినతిపత్రాలను సీఎం గారికి అందజేస్తామని చెప్పారని, అయితే రాజకీయ, అధికార ఒత్తిళ్ల మధ్య నిజంగా ఆ వినతిపత్రాలు సీఎం చేతికి చేరుతాయా అనే సందేహం ఉందని కుంజ శ్రీను వ్యాఖ్యానించారు. నిజంగా సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీ నాయకులను నేరుగా ముఖ్యమంత్రిని కలిసేలా ఏర్పాటు చేయాల్సిందని అన్నారు.

శాంతియుతంగా సమస్యలు వివరించి పరిష్కారం కోరడమే ASP లక్ష్యమని, అయితే ప్రభుత్వం ఆ నమ్మకాన్ని వమ్ము చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవో నెం.3కు ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావడం, 1/70 చట్టాన్ని మరింత పటిష్టం చేయడం ప్రభుత్వానికి కష్టమైన పని కాదని, కానీ అందుకు రాజకీయ సంకల్పం అవసరమని పేర్కొన్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న నాయకుల నుంచి కనీసం ఒక వినతిపత్రం స్వీకరించే మనసు కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరమని అన్నారు.

జీవో నెం.3 అంశంలో కేవలం గత ప్రభుత్వాలపై నిందలు మోపడం సరైన విధానం కాదని, 2002లో కేసు నమోదైనప్పటి నుంచి వివిధ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని గుర్తు చేశారు. జీవోలోని లోపాలను అప్పుడే సరిదిద్ది చట్టపరమైన రక్షణ కల్పించి ఉంటే నేడు ఆదివాసులు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని అన్నారు.

ఆదివాసీల న్యాయపోరాటం కారణంగానే జీవో నెం.3 రెండు దశాబ్దాల పాటు నిలబడగలిగిందని, కాలయాపన చేసే హామీల కంటే చట్టబద్ధమైన పరిష్కారాలే ఆదివాసీలకు అవసరమని కుంజ శ్రీను స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!