అమెరికా దిగుమతి విధానాలను మరింత కఠినతరం చేస్తూ భారత్‌తో పాటు మరో 16 దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) సెక్షన్ 301 కింద నిర్వహించిన విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకోగా, కొత్త టారిఫ్‌లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. నిర్బంధ కార్మిక వ్యవస్థ ద్వారా తయారయ్యే ఉత్పత్తుల దిగుమతులను అడ్డుకోవడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అమెరికా వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు మొత్తం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. తొలుత భారత్‌పై 12.5 శాతం అదనపు సుంకం విధించే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ, కార్మిక ప్రమాణాల అమలులో భారత్ తీసుకున్న చర్యలు, ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భారత్‌ను 10 శాతం సుంకం శ్లాబ్‌లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో భారత్‌కు కొంత ఊరట లభించినట్లు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ మాట్లాడుతూ, ప్రపంచ సరఫరా గొలుసుల్లో నిర్బంధ కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అమెరికా ఇప్పటికే అలాంటి ఉత్పత్తుల దిగుమతులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోందని, ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా అదే తరహా ప్రమాణాలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.









