బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు వస్తున్న కథనాలు అక్కడి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామంపై అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
షాబుద్దీన్ పదవీకాలం ముగియడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ముందుగానే పదవి నుంచి తప్పుకునే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2024 విద్యార్థి ఉద్యమం తర్వాత కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్న కీలక వ్యక్తిగా ఆయన నిలిచారు.
2024 ఆగస్టులో జరిగిన విద్యార్థి ఉద్యమం అనంతరం షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. ఈ ఏడాది చివర్లో తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తానని షేక్ హసీనా ప్రకటించడంతో, దేశ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.









