జీమెయిల్ పాస్‌వర్డ్ మరిచిపోయి, రికవరీ కోసం నమోదు చేసిన ఫోన్ నంబర్ లేదా ప్రత్యామ్నాయ ఈమెయిల్ అందుబాటులో లేని పరిస్థితుల్లో యూజర్లకు సహాయపడేందుకు గూగుల్ కొత్త ‘సెల్ఫీ వీడియో’ సెక్యూరిటీ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు చిన్న వీడియోను రికార్డ్ చేసి తమ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో సాధారణ సైన్-ఇన్ విధానాలు పనిచేయనప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది.
ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్లు ముందుగా తమ ఫోన్ సెల్ఫీ కెమెరాతో ఒక చిన్న వీడియోను రికార్డ్ చేయాలి. ఆ వీడియోను గూగుల్ భవిష్యత్ ధృవీకరణ కోసం సురక్షితంగా భద్రపరుస్తుంది. తర్వాత ఎప్పుడైనా పాస్‌వర్డ్ మరిచిపోయినప్పుడు లేదా సాధారణ పద్ధతుల్లో లాగిన్ కాలేకపోయినప్పుడు, లైవ్ వీడియో రికార్డ్ చేయాలని గూగుల్ కోరుతుంది. ఆ లైవ్ వీడియోను ముందుగా సేవ్ చేసిన వీడియోతో పోల్చి యూజర్ గుర్తింపును నిర్ధారిస్తుంది.
ఈ ప్రక్రియలో ముందే రికార్డ్ చేసిన వీడియోలు లేదా ఫోటోలను ఉపయోగించడానికి అవకాశం ఉండదు. కేవలం అప్పటికప్పుడు తీసిన లైవ్ వీడియోనే సిస్టమ్ అంగీకరిస్తుంది. అధునాతన భద్రతా వ్యవస్థలు, బహుళ సెక్యూరిటీ లేయర్లతో పనిచేసే ఈ టెక్నాలజీ డీప్‌ఫేక్ వీడియోలను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉండటంతో, అసలైన యూజర్‌కే అకౌంట్ యాక్సెస్ లభించేలా గూగుల్ భద్రతను మరింత బలోపేతం చేసింది.









