దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యుజీ (NEET-UG) పేపర్ లీకేజీ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ (NTA) చేపడుతున్న శాశ్వత సంస్కరణలపై సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం పరీక్షల నిర్వహణలో తాత్కాలిక చర్యలు కాకుండా వ్యవస్థాగత మార్పులు అవసరమని స్పష్టం చేసింది.
పరీక్షల భద్రత, పారదర్శకత, డిజిటల్ మౌలిక వసతులు, పరిపాలన, మానవ వనరులు, పరిశోధన తదితర 10 కీలక విభాగాల్లో ఇప్పటివరకు సాధించిన పురోగతిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్‌టీఏను కోర్టు ఆదేశించింది. అలాగే పరీక్షల భద్రత కోసం నియమించిన అదనపు డైరెక్టర్ జనరల్ బాధ్యతలు, పరీక్షకు ముందు నుంచి అనంతరం వరకు అమలు చేస్తున్న భద్రతా చర్యలపై కూడా నివేదిక సమర్పించాలని సూచించింది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానానికి మార్పు, అభ్యర్థుల గుర్తింపు కోసం ఆధునిక సాంకేతికతల వినియోగం, డేటా భద్రత వంటి అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం దాఖలైన అఫిడవిట్‌లో ఈ వివరాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టుకు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా త్వరలోనే సమగ్ర అఫిడవిట్ సమర్పిస్తామని తెలిపారు. సంస్కరణల అమలును ఏడాది పొడవునా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.









